Bilva patram importance


శివ పూజలో బిల్వ పత్రం ప్రాముఖ్యత :

పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం "ఏక బిల్వం శివార్పణం" అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము. ఙ్ఞానస్వరూపమయిన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము.

మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండాటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచ్చింది. ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా పూజకుడు - పూజ్యము - పూజ/స్తోత్రము - స్తుత్యము - స్తుతి/ ఙ్ఞాత - ఙ్ఞ్యేయము - ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు. ఇలాగ ముడిటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము. ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించినప్పటికి, ఆధారకాండము ఒకటే అయినట్లు, సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ మహదేవుడు మారెడు దళాలతో మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కాని ఆయన సర్వాంతర్యామి!

బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృశించడంవలన సర్వ పాపాలు నశిస్తాయి. ఒక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించడం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయి. అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. 
"పూజకుడవు నీవే, పూజింబడేది నీవే" - అనే భావంతో శివుని పూజించుటయే ఉత్తమమైన భావం. ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని - బిల్వపత్రరూపంతో "త్రిపుటి ఙ్ఞానాన్ని" నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని" శివోహం, శివోహం " అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.

పవిత్రమైన ఈశ్వర పూజకు "బిల్వపత్రం" సర్వశ్రేష్టమైనది. శివార్చనకు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి. బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి.

 

2018 © Prudwi.com. All Rights Reserved. A Unit of Vasundara Info Solutions Pvt Ltd